పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0251-6 సౌరాష్ట్రం సం: 09-006

పల్లవి:

అలిగేదె సహజము ఆఁడువారికి
మలసి నీవె తిద్దుక మన్నించవయ్యా

చ. 1:

పలుకక నే నెంత పంతాన నీతో నుండిన
తలఁపు నీపైదెకాన తప్పులేదు
చెలఁగి మందెమేళాన చెయివట్టి తీసినాను
యెలమి నీవూడిగాన కెగ్గు లేదు

చ. 2:

మల్లాడి కోపముతోడ మంచము దిగకుండిన
తొల్లె నీకాలు దొక్కితి దోసము లేదు
పల్లదాన వెంగెమాడి పకపక నవ్వినాను
వెల్లవిరి నాపనికి వెగటు లేదు

చ. 3:

కావరించి నిన్నుఁగూడి గర్వముతో నుండినాను
కైవసముయితిఁగాన కడమ రేదు
శ్రీ వెంకటేశ నన్ను జిత్తగించి యేలితివి
వేవేలు భోగములకు వేసట లేదు