పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0260-3 పాడి సం: 09-057

పల్లవి:

చెఱఁగుమాసినసుద్ది చెప్పఁ జాల కుండేవు
యెఱఁగము కైదప్పు లెందు మోచునో

చ. 1:

చెక్కుచేతితో నీవు సిగ్గువడి నవ్వేవు
చొక్కపు విభుఁడు నిన్నుఁ జూచె నంటాను
తక్కక యాతఁడు నిన్ను దగ్గరి పైఁ జెయి వేసి
యిక్కువ లంటినప్పుడు యేమి సేసేవే

చ. 2:

కాలిమీఁదఁ గాలు వేసి కడుఁ దల వంచేవు
అలరి కేలికిని రమ్మనె నంటాను
కోలుముందై యాతఁడె గొబ్బున దగ్గరి వచ్చి
కేలుఁ గేలఁ బెనచితె కిందు పడెవా

చ. 3:

సరిలేని తమకాన జలకేళి సేసేవు
అరిది శ్రీ వెంకటేశుఁ డంటీ నంటా
గరగరికల నిన్నుఁ గలసె నాతఁ డిట్టె
అరయఁగ నంటుముట్టు లవి దీరెఁ గదవే