పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0260-1 భూపాళం సం: 09-055

పల్లవి:

నిండు సోబనము నేఁడు నెయ్యపు దంపతులకు
మెండుగ నారతులెత్తి మీఁద సేసచల్లరే

చ. 1:

కట్టుఁడు కలువడాలు ఘనమైన తోరణాలు
గట్టిగాఁ బట్టణము సింగారించరే
కిట్టి రుక్మిణీదేవిఁ గృష్ణుఁడు పెండ్లాడి వచ్చె
పెట్టుఁ డిందరికి నేఁడు పెండ్లి విడేలు

చ. 2:

పాడరె సోబనాలు పై పై నె పేరఁటాండ్లు
యీ డా డనక వీధు లేఁగించరే
జాడతో వాయించరె పంచమహావాయిద్యాలు
యీడనె పెండ్లికట్నా లియ్యరె యిద్దరికి

చ. 3:

పొత్తుల విందులు దెచ్చి బువ్వమున‌ నిడరే
హత్తి గంధాక్షత లీరె అందరు నేఁడు
నిత్తెమై శ్రీ వెంకటాద్రి నిలయుఁ డీ కృష్ణుఁడు
తత్తరాన నీకెఁ గూడె దగ్గరి సేవించరే