పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0259-4 హిందోళవసంతం సం: 09-052

పల్లవి:

ఎంచ నిన్నిటికి లోనయితిఁగా నేను
అంచెలఁ దలఁచుకొంటె నరుదయ్యీ నాకు

చ. 1:

రేసు వెన్నెల యండ కోరిచెఁగా నాతనువు
ఆసల నా ప్రాణవిభుఁ డాతనిఁ బాసి
వోసరి నిట్టూర్పుగాలి కోపెఁగా నామనసు
గాసిలి యీతని తమకపువేళను

చ. 2:

విరహానలము చొచ్చి వెళ్ళెఁగా నామనసు
సరుగనఁ బతితోను సారె నలిగి
పొరిఁ గన్నీటివఱదఁ బోక వచ్చెఁగా నాచూపు
గిరవై చింతల మునిఁగినవేళను

చ. 3:

వుమ్మల మోనానఁ బతికుండెఁగా నా నగవు
అమ్మరొ యాతఁడు మాటలాడినదాఁకా
నెమ్మిఁ బరవశములో నిలిచెఁగా నాముదము
కమ్మర శ్రీ వెంకటేశుకాఁగిట యీవేళను