పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0259-2 లలిత సం: 09-050

పల్లవి:

ఇందు కేమె అందు కేమె యింతలోనె యరవౌనా
అందపుఁ జుట్టాల మౌత అందరు నెరఁగరా

చ. 1:

వొద్దనుండవలెనా వొక్కటై తాను నేను
యిద్దరము నున్న నేల యేకమె కాదా
సుద్దముగ మోము మోముఁ జూడవలెనాయెదుట
కొద్దిచంద్రునందు రెండు గూడవా మా చూపులు

చ. 2:

మాటలాడవలెనా నామాటలుఁ దనమాటలు
గాఁటపు ఆకసమందుఁ గలసీఁ గదె
చోట నిట్టె మేను మేను సోఁకవలెనా తన్ను
నాఁటి సోఁకినట్టి గాలె నన్ను సోఁకీఁ గదవే

చ. 3:

కలయఁగవలెనా కందువ మా మనసులు
గలపిన చిత్తజుఁ డొక్కఁడె కదె
యెలమి శ్రీవెంకటేశుఁ డింతలో విచ్చేసి కూడె
పలుకుఁ బంతము నొక్కపాటాయఁ గదవే