పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0259-1 ముఖారి సం: 09-049

పల్లవి:

విభునికి నీమాటె విన్నివించరా
సభల దూరపుటేర్లు జలధులఁ గూడవా

చ. 1:

దవ్వులనుండితేనె దగ్గరి వుండుట గాదా
దవ్వులనుండిన తన్నుఁ దలఁచఁ గదే
దవ్వుగాదా సూర్యునికి ధరణిఁ దామరలకు
దవ్వుల పొందులె కడుఁ దగులము లాయనే

చ. 2:

ఆకడి మో మైతేనె యీకడి మో మౌత గాదా
ఆకడఁ దనదిక్కు మో మైతినేఁ గదే
ఆకసపు మొయి లేడ అడవినెమలి యాడ
దాకొని వింతగుచూపు తరితీపు దానే

చ. 3:

ఆసమాట లాడితేనె అండకు వచ్చుట గాదా
వాసి నేఁ దనకడకు వచ్చితిఁ గదే
యీసులేక శ్రీ వెంకటేశుఁ డేడ నే నేడ
వేరక కూడితిమి వింత లెల్లఁ జేరెనే