పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0258-5 శంకరాభరణం సం: 09-047

పల్లవి:

నిన్ననె పెండ్లి నాకు నేఁడు నీకు
తన్నుఁ దానె సమకూడె దైవము మెచ్చితిరా

చ. 1:

మిక్కిలి మోహము నాకు మేఁటి రాజసము నీకు
నిక్కి చూపు లెల్ల నాకు నిండుఁ బరాకు నీకు
మొక్కుల మాటలు నాకు మోనపుగుట్లు నీకు
తక్కక సేసినయట్టి దైవము మెచ్చితిరా

చ. 2:

విరహపుఁగాఁక నాకు వెన్నెల నవ్వులు నీకు
సరసపుఁ దమి నాకు జంపులు నీకు
పెరిగె యాసలు నాకు బీరపు బిగువు నీకు
దరియై గడించినట్టి దైవము మెచ్చితిరా

చ. 3:

బిగువుఁగాఁగిలి నాకు పెనుఁజెమటలు నీకు
జిగిమోవిఁ దేనె నాకు జీరలు నీకు
పగటు శ్రీవెంకటేశ పైపయిఁ గూడితి మిట్టె
తగుఁ దగు నిన్నిటికి దైవము మెచ్చితిరా