పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0258-4 లలిత సం: 09-046

పల్లవి:

విచ్చేయవయ్య నీవు వేగమె యింతటనైన
తచ్చి యిన్నియును సరిదాఁకెఁ గదవయ్యా

చ. 1:

యింతిమనోరథములు యెంచరాదు పంచరాదు
కాంతుఁడ నీకురులు లెక్కకు రానట్టు
పొంత నాకె తలపోఁతఁ బుట్టిన విరహములు
వింతగా నీశిరసున వెళ్ళెఁ గదవయ్యా

చ. 2:

చెలి చింతాలత లివి చిక్కులాయ జీర లాయ
కెలన నీరేకలు మైఁ గెరలినట్టు
అలరి యాకె మదనానలపుబొగ లెల్లాను
కులికి నీమేనఁ జుట్టుకొనెఁ గదవయ్యా

చ. 3:

సతికరములు నీసమరతులఁ బెనఁగె
రతి నీచూపులు మేన రానైనట్టు
యితవై శ్రీవెంకటేశ యిన్నిటా మీయిద్దరికి
సతమైన వలపులు జట్లాయ నయ్యా