పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0258-3 ముఖారి సం: 09-045

పల్లవి:

ఇందు నందునె యింతిపోలికలు
విందుల విభునికి వేడుకలాయ

చ. 1:

వెడఁగుఁ దీగెలను విరులపరిమళము
పడఁతిమాటలనుఁ బరిమళము
బడిఁ గనకమునకుఁ బదారువన్నెలు
సుడిగొని వనితకు షోడశకళలు

చ. 2:

కులికి సురతరువుకొమ్మునఁ బూఁపలు
పొలిఁతికుచంబునఁ బూఁపలు
వెలయు వసంతపువేళనె చిగురులు
చెలి పాదములను చేఁగ చిగురులు

చ. 3:

పొంత జలనిధులఁ బొడమెఁ దామెరలు
కాంతకరములె కమలములు
యింతట శ్రీవెంకటేశుఁడు గూడఁగ
కాంతరతుల కివి కదంబమాయ