పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0258-2 శుద్దవసంతం సం: 09-044

పల్లవి:

నే సతము గాక నీకు నీవు నేనుఁ గలదాఁక
యీసులేని విభుఁడ నీకివి సతమా

చ. 1:

మంతనపు నీ వొట్లు మాట నే నాడినదాఁకా
చింతల నీ సిగ్గు వొంటిఁ జిక్కినదాఁకా
పంతపు నీబిగువు నేఁ బచ్చి సేసినదాఁకా
అంతటి మీఁదట నీకు నవి సతమా

చ. 2:

అలుకలుఁ జలములు ఆయము లంటినదాఁకా
బలిమి సరసము నేఁ బైకొనుదాఁకా
తలఁపు నీగుట్టు నేఁ దప్పక చూచినదాఁకా
అలరి యంతటిమీఁద నవి సతమా

చ. 3:

కన్నుల నీమొక్కులు నేఁ గాఁగిలించినదాఁకా
మిన్నక రతులు నే మెచ్చినదాఁకా
యెన్నఁగల శ్రీవెంకటేశ నిన్నుఁ గూడితినే
అన్నులకడలపొందు లవి సతమా