పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0258-1 సామంతం సం: 09-043

పల్లవి:

ఎందు కెందుఁ బోలిచేవె యింతి వోరి
అందుకె కాదా నీయడియాసలు

చ. 1:

పాదమున నే నిట్టె బయలుచిమ్మిన నీవు
వాదుకు వచ్చే వేమె వనితా
యీదెస నెంచి చూచితె నిటువంటి బయలె నా
గాదిలి నడు మవుత కానవా నీవు

చ. 2:

దాపునఁ దామరమీఁదఁ దమ్ముల ముమిసితేను
కోపగించుకొనే వేమె కోమలి
పో పో ఆతామరనెపోలిన నా నెమ్మోము
చూపులు గలుగు నన్నుఁ జూడవా నీవు

చ. 3:

అద్దము మెరుఁగు వెట్టేనని గోర నంటితేను
గద్దించే విది యేమే కలికి
నిద్దపు శ్రీవెంకటేశ నీవు నన్నుఁ గూడితివి
అద్దపు నాచెక్కు లిప్పుడవి చూచెఱఁగవా