పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0252-6 సామంతం సం: 09-042

పల్లవి:

పూవక పూచిన వెల్లాఁ బూఁపలయ్యీనా
చేవదేర దగ్గరక చింత లెల్లఁ దీరునా

చ. 1:

రేపు నవ్వుదువుగాని రేయి నాకొం గంటకురా
దాపుల సరములఁ దని వయ్యీనా
తీపు నీరువట్టుగొంటె తేటనేయి మందవునా
పై పైఁ గలయక యీపచ్చిచేఁత లేలరా

చ. 2:

యిచ్చక మూడుదుగాని యియ్యకొంటిఁ బో పోరా
గచ్చుల వినయములు గాకమానీనా
మచ్చిక నాఁకలివేళ మంచి విరు లింపవునా
హెచ్చినరతులఁ గాక యిందువల్ల నేమిరా

చ. 3:

అవ్వల మొక్కుదుగాని అంతేసి సేయకురా
రవ్వనిన్నుఁ జేయక నా రాఁపు వాసీనా
యివ్వల శ్రీవెంకటేశ యింతలోఁ గూడితి నన్ను
దవ్వులే చేరువ లాయఁ దలపోఁత లేలరా