పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0257-5 సామంతం సం: 09-041

పల్లవి:

ఉదయించె నతఁడు నీ వుదయించ వేలయ్య
మదిరాక్షిఁ గూడి యిట్టె మన్నించవయ్యా

చ. 1:

జలజబంధుఁ డతఁడు జలజాక్షి వదనపు
జలజబాంధవుఁడవు సరుస నీవు
అలరి నాకాశమందె యతనికి విహరించఁ
గలికి నడిమియాకస మిదె నీకు

చ. 2:

చీఁకటివైరి యతఁడు చెలియమనసులోని
చీఁకటివైరివి నీవు చేచేతనే
ఆఁక జక్కవలఁ గూర్చు నతఁడు నీ వీడ నైతె
కాఁక చనుజక్క వలఁ గలపఁగ వలదా

చ. 3:

దినరా జతఁడు భూమిఁ దెరవపాలికి నీవు
దినదినరాజవు తేజమనను
ఘనుఁడ శ్రీవెంకటేశ కాంతఁ గూడితివి నేఁడు
గనియై యాతఁడు సూర్యకాంతమునఁ గూడెను