పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0257-3 వరాళి సం: 09-039

పల్లవి:

నీట ముంచు పాల ముంచు నీచిత్త మిఁకను
యీటగు నీపతిభావ మిది గలది

చ. 1:

తప్పక చూచుఁ జూచు తలవంచు నంతలోనె
వుప్పతిల్లఁ బులకించు నుస్సురనును
కప్పురగంధి నీవుఁ గదిసి కూడిన కాఁక
చెప్పరాదు విరహము చెంతల నీపతికి

చ. 2:

చిన్నఁబోవు నంతలోనె చెలులపైఁ గోపగించు
కన్నచో వెదకు మేనఁ గప్పు కప్పును
కన్నెరొ విభఁడు నీవు కళ లంటినదాఁక
మిన్నక చింతాజలధి మీరరాదో యమ్మ

చ. 3:

బుద్దు లెంచుకొను లోలో పోసరించి కల్లపడు
అద్దివొ శ్రీవెంకటేశుఁ డాడ నాడనె
వొద్దికై నీ విటువలె వొనగూడి వుండుదాఁక
చద్దికి వేఁడికి వెదచల్లు లాయ వలపు