పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0251-3 భైరవి సం: 09-003

పల్లవి:

ఏమి సేతు నాగుణ మీపాటిది
కామించి వీవుగాఁగాఁ గైకొనేవు గాని

చ. 1:

ననుపు నటించఁగానె నంటు నీతో నైతిఁగాని
పెనఁగితేఁ గడుఁ గడు పెలుచ నేను
మనసు నమ్మించఁగానె మారుమాట లాడఁ గాని
ఘనమై మీరి వచ్చితె గబ్బిదాన నేను

చ. 2:

సలిగె చెల్లించఁగానె సరుసమాడేఁ గాని
మలసితే నంతకంటె మంకను నేను
చలివాసి నవ్వఁగానె సంతోసించుకొంటిఁ గాని
సొలసి కపటమైతె జూటుదాన నేను

చ. 3:

కైవసము గాఁగానె కరఁగి మెచ్చితిఁ గాని
మూవంకలు మెట్టితేనె మొక్కలి నేను
శ్రీవెంకటేశ నీవు చేరి కూడఁగానె కాని
సోవలుగా మొరఁగితే జూజరి నేను