పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0256-5 ముఖారి సం: 09-035

పల్లవి:

ఔనో కాదో నీ వాన తీవయ్య
పని వేరొకటి యిఁకఁ బోలదయ్యా

చ. 1:

చంచలము నాచూపు చంచలము నీగుణము
యెంచె నీ వే మనేవొ యెరఁగమయ్య
ముంచి నా గుబ్బలు రాయి మొగి నీ గుండెరాయి
అంచల నాకడ నేమి యాడుకొనేవయ్యా

చ. 2:

చిగురు నా యధరము చిగురు నీ చిత్త మదె
తగెఁ దగ దందు కేమి తలవయ్య
నగవు నా మోమెల్ల నగుఁబాటు నీచింత యీ
తగవు చెలులతోడ తరిఁ జెప్పవయ్యా

చ. 3:

లేఁత నాకుఁ గొనగోరు లేఁత నీవయసు గడు
యీఁతలు మోఁతలు నిఁక నేలయ్యా
ఘాతల శ్రీవెంకటేశ కదిసి కూడితి నన్ను
యీతల నిద్దరిభావాలేక మాయనయ్యా