పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0300-5 గౌళ సం: 09-299

పల్లవి:

అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము
శ్రింగారరాయఁడ నీకు శ్రీపతినిధానము

చ. 1:

కమలాలపానుపు కాంతకు నీవురము
ప్రమదపు నీమనసు పాలజలధి
అమరు నీభుజాంతర మట్టె తీగెపొదరిల్లు
రమణీయ హారాలు రత్నాలమేడలు

చ. 2:

సతికి నీమెడ రతిసాముసేసేకంబము
ప్రతిలేని వయ్యాళి బయలు నీవు
మతించిన కౌస్తుభమణి నిలువుటద్దము
మితిలేని శ్రీవత్సము మించు బండారుముద్ర

చ. 3:

నెమ్మి నలమేల్‌మంగ నీ కాఁగిలి పెండ్లిపీఁట
చిమ్ముల చందనచర్చ సేసపాలు
వుమ్మడి మెడనూళ్ళు వుయ్యాలసరపణులు
పమ్మి శ్రీవెంకటేశ నీభావమే భోగము