పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0300-6 సాళంగనాట సం: 09-300

పల్లవి:

అలుగకువమ్మ నీ వాతనితో నెన్నఁడును
పలువేడుకలతోనె పాయకుండరమ్మా

చ. 1:

జలధిఁ దపము సేసె సాధించెఁ బాతాళము
నెలఁత నీరమణుఁడు నీకుఁగానె
యిలవెల్లా హారించె నెనసెఁ గొండగుహల
యెలమి నిన్నిటాను నీకితవుగానె

చ. 2:

బాలబొమ్మచారై యుండెపగలెల్లా సాధించె
నీలీలలు దలఁచి నీకుఁగానె
తాలిమి వ్రతమువట్టి ధర్మముతోఁ గూడుండె
పాలించి నీవుచెప్పిన పనికిఁగానె

చ. 3:

యెగ్గు సిగ్గుఁ జూడఁడాయె యెక్కెను శిలాతలము
నిగ్గుల నన్నిటా మించె నీకుఁగానె
అగ్గలపు శ్రీవెంకటాద్రీశుఁడై నిలిచె
వొగ్గి నిన్నురాన మోచివుండుటకుఁ గానె