పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0300-2 శ్రీరాగం సం: 09-296

పల్లవి:

మనసు మెత్తనిదాన మరిగినదాన నీకు
చనవు చేకొన్నదాన సమ్మతించవయ్యా

చ. 1:

మొక్కలానఁ గోపగించి మోము చూడకుందుఁ గాని
తక్కక నీరూపు నాతలఁపులోనెవుండు
చిక్కక ఆవేళ నీచిత్త మెట్టుండునో యని
మొక్కెద నిదివో నీకు మొగిఁజేకోవయ్యా

చ. 2:

చెప్పుడు వారి మాఁటకు చింతతోడనుందుఁగాని
యెప్పుడూ నీరాకకు నెదురు గాచుకుండుదు
కుప్పించి నాఘాత కెంతకొంకుచునుందువో నీవు
చెప్పి యందుకె సేవసేసేఁ జూడవయ్యా

చ. 3:

వచ్చిన వూఁకున నిన్ను వడిఁ దమకింతుఁగాని
యిచ్చకురాలనే నీకు నిటు నేను
అచ్చపు శ్రీవెంకటేశ అలమేలుమంగను
మచ్చికఁ గూడితి నిఁక మన్నించవయ్యా