పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0300-1 మంగళకౌశిక సం: 09-295

పల్లవి:

ఇద్దరూ నవ్వుతా నున్నా రింతటిలోనె
యెద్దుబండికంటి సంది యేమాయనయ్య

చ. 1:

చెంగలువబంతి వేసె సేయరాని చేఁత సేసె
ముంగురులు పట్టి తీసె మొదలఁ జెలి
అంగనయింటిలో కేఁగి తటమీఁది సుద్దెరఁగ
యింగితపు మీవాదు లేమాయనయ్యా

చ. 2:

కన్నులఁ దప్పక తిట్టె గక్కన నీచేయి వట్టె
చన్నులు రొమ్మునఁ బెట్టె సాధించె నిన్ను
యెన్నికఁ దెరవేసితి వేమిసేసితో యెరఁగ
యిన్నేసి మీ పంతములు యేమాయనయ్యా

చ. 3:

కప్పురము నోటికిచ్చె కాఁగిలించి నిన్నుమెచ్చె
అప్పుడె శ్రీవెంకటేశ అలమేల్‌‌మంగ
దప్పిదేరితి వాపెతో తగ నన్ను మన్నించితి
యిప్పుడు మీ యెన్నికలు యేమాయనయ్యా