పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0299-6 పాడి సం: 09-294

పల్లవి:

వేసరివున్నారు తొల్లె వెలఁదులిందరు నీతో
వీసమంతపనికైనా వీఁగింతురు సుమ్మీ

చ. 1:

నీవు మోహించినసతి నిన్నేమనినాఁ జెల్లు
ఆవటించి నీ వాపె నేమనినాఁ జెల్లు
పూవుఁగాక పిందెఁగాక పోదిఁ బెట్టుకున్నవారి
దీవెనమాటలాడినాఁ దిట్టుదురు సుమ్మీ

చ. 2:

చనవుగలుగుయింతి జంకించ నిన్నుఁదగు
చెనకి నీవాపె నేమిసేసినాఁ దగు
ననిచియు ననచక నవ్వుకె లోనైనవారిఁ
దనువులు నిమిరినాఁ దట్టింతురు సుమ్మీ

చ. 3:

పట్టపు అలమేల్‌మంగ పై కొంటివి నీమెచ్చు
గుట్టు శ్రీవెంకటేశ నీకూటమి మెచ్చు
ఱట్టుగా నాపెచేత నాఱడిఁబడ్డయట్టివారిఁ
బట్టి బలిమిఁ గూడితి పంగింతురు సుమ్మీ