పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0299-5 హిందోళవసంతం సం: 09-293

పల్లవి:

అమ్మవారు నయ్యవారు నండనె కూచున్నవారు
యిమ్ముల నిద్దర జాణ లేమందమే

చ. 1:

కొల్లున నవ్వీ నతఁడు గుట్టున నున్నది యాకె
తెల్లవారుదాఁకా మాఁటదిద్దనె పట్టె
పల్లద మాతనివంక పంతము లీచెలివంక
యిల్లిదె యిద్దరూ సరె యేమందమే

చ. 2:

తొక్కుఁ బాదము లతఁడు తొరలి పెనఁగు నీకె
చెక్కులు నొక్కి బుద్దులు చెప్పనె పట్టె
మొక్కల మాతనిపాలు మురిపె మీసతిపాలు
యెక్కెఁజల మిద్దరికి నేమందమే

చ. 3:

చేతులు చాఁచు నతఁడు సిగ్గుననుండు నీకె
యీతల విడే లిద్దరి కియ్యనె పట్టె
ఆతఁడు శ్రీవెంకటేశుఁ డలమేలుమంగయింతి
యేతుల నిద్దరూఁ గూడి రేమందమే