పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0299-4 ఆహిరి సం: 09-292

పల్లవి:

వట్టిచనవులఁబోతే వాసిగలదా
నెట్టన నీకు మొక్కితే నీవె మెచ్చేవూ

చ. 1:

మన్ననగలకాంతలు మాటలాడఁ జెల్లుఁగాక
వున్నవారు మాటాడితే నొద్దికలౌనా
విన్నా విననియట్టు కన్నాఁ గననియట్టు
సన్నల మెలఁగితేనె జాణతనముగాకా

చ. 2:

ననుపు గలుగువారు నవ్వినా నమరుఁగాక
వనితలెల్లా నవ్వితే వాడికలౌనా
పెనఁగినాఁ బెనఁగక బిగిసినా బిగియక
మనసులో మెలఁగుటే మంచిదిగాకా

చ. 3:

అలమేలుమంగను నే నంటిముట్టఁ జెల్లుఁగాక
వెలుపలివా రంటితే వేడుకలౌనా
నెలవై శ్రీవెంకటేశ నీవు నన్నుఁ గూడితివి
బలిమి మెరయుటే పంతముగాకా