పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0299-3 రామక్రియ సం: 09-291

పల్లవి:

దూరుదురు మమ్మును బుద్దులు చెప్పరంటాను
యీరీతి నింతలోనె యిటువలెఁ జూతురా

చ. 1:

చిత్తములో చింతలేలె సిగ్గులు వడఁగనేలె
కొత్తపండ్లికూఁతురవాకొమ్మ నీవు
చిత్తిణిగుణమాతఁడు సెలవుల నవ్వుతోడ
పొత్తుకుఁ బిలువఁగాను బొమ్మల జంకింతురా

చ. 2:

కన్నుల మొరఁగులేలె కడు నివ్వెరగులేలె
కన్నెపడుచవాయేమె కలికి నీవు
వెన్నవంటివాఁ డతఁడు వేడుకఁ గొంగు వట్టఁగా
సన్నలతిట్లతోడ చలము సాధింతురా

చ. 3:

వుసురన నిఁకనేలె వొగిఁ దలవంచనేలె
పసిబాలవాయేమె పడఁతి నేఁడు
అసుదు శ్రీవెంకటేశుఁ డలమేల్‌ మంగ నీవు
పొసఁగ నాతఁడు గూడి పూఁచి కొసరుదురా