పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0299-1 ముఖారి సం: 09-289

పల్లవి:

చదురాల నేను జాణఁడవు నీవు
తుది మొదల లెంచితేను దొమ్మిగాదా

చ. 1:

మనసు నెరుఁగుదు మర్మము నెరుఁగుదును
ననుఁజూచి నీవింత నవ్వవలెనా
పనులెల్లాఁ దక్కెను పంతము తుద కెక్కెను
పెనఁగఁబోతే నింక పిప్పి గాదా

చ. 2:

పలుకఁగ నేరుతును భ్రమయించ నేరుతును
యెలమి నాతో నింత యెమ్మెవలెనా
తలఁపు లీడెరెను తమకము దైవారెను
చలపట్టితే నింక చప్పఁ గాదా

చ. 3:

పట్టెమంచ మెక్కితిని బలువావి చేకొంటిని
మెట్టుక నాతో నింత మెచ్చవలెనా
అట్టె శ్రీవెంకటేశుఁ డలమేలుమంగ నేను
గుట్టుతో నుండితే నింక కొసరుగాదా