పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0296-6 భైరవి సం: 09-288

పల్లవి:

కదిసితి రిద్దరును కన్నులపండుగగాను
పెదవుల తేనెలనే పిక్కటిల్లీఁ బ్రేమము

చ. 1:

పలుకుల కొదలుతో పయ్యద వదలుతోడ
చెలి నీపై వలపులు చిందఁ జొచ్చెను
అలుగకు నీవంత ఆయములు రేఁగీని
చలపట్టి వోరిచితే చక్కనయ్యీఁ బనులు

చ. 2:

కొప్పుజారు విరులతో కులుకుఁ జూపులతోడ
చిప్పిలు నాసలు నీపైఁ జిందఁ జొచ్చెను
వుప్పటించ కంత నీవు వొడలెల్లఁ బులకించి
తొప్పఁదోగి నవ్వితేనె తుదకెక్కీ రతులు

చ. 3:

కూరిమి మొక్కులతోడ కొనగోరి తాకులతో
సారెకు సిగ్గులు నీపైఁ జల్ల జొచ్చెను
పేరడిఁ బెట్టకు మంత ప్రేమపు శ్రీవెంకటేశ
యీరీతిఁ గూడితి వింకనిరవయ్యీ మెచ్చులు