పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0298-5 ఆహిరి సం: 09-287

పల్లవి:

కూళతనమున నిన్నుఁ గొసరే మింతెకాక
జాలి మావలపు నీకుఁ జవులయ్యీనా

చ. 1:

తేలింపుఁ గన్నుల యాపె తీపులమాటల యాపె
లోలునిఁగాఁ జేసె నిన్ను లోక మెరఁగ
మాలుగొని వున్నాఁడవు మదమెత్తివున్నాఁడవు
ఆలరి మావిన్నపము లాలకించేవా

చ. 2:

సెలవినవ్వుల యాపె చేఁతలకలికి యాపె
బలిమి నీ మనసెల్లా భ్రమఁ బెట్టెను
చెలరేఁగి వున్నాఁడవు సిగ్గువిడిచున్నాఁడవు
అలరి మావంక యించుకంతైనాఁ జూచేవా

చ. 3:

కన్నుల మొక్కుల యాపె గయ్యాళితనము లాపె
సన్నలుసేసి నిన్ను జట్టిగొనెను
నన్నుఁ గూడి శ్రీవెంకటనాయక మించినాఁడవు
పన్నిన నీవయసు ఆఁపఁగఁగలవా