పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0255-4 వరాళి సం: 09-028

పల్లవి:

ఏల నన్ను నేర మెంచే వింత కున్నదా
చాలు నో విభుఁడ నీతోఁ జలము నా కున్నదా

చ. 1:

గద్దరి నామొకము నాకన్నులకె పాటి గాక
సుద్దుల నీచూపు చల్లఁ జో టున్నదా
బద్దమై నావదనము పాటలకె కొద్దిగాక
యిద్దివో నాతో మాట కెడ మున్నదా

చ. 2:

కొనబు నాచేతులు నాకొప్పు వెట్టనె కాక
వొనరి నీకైదండ కోపి కున్నదా
పెనఁగు నాపాదములు పిరుఁదు మోవనె కాక
ననిచి నీవొద్దికి రా నడ పున్నదా

చ. 3:

సరి నావురము నాకుచాలకె తావు గాక
సరవి నీకాఁగిటికి సందున్నదా
కరఁగి కూడితి శ్రీవెంకటపతినె నిన్ను
యిరవైన నీకు నాకు నెర వున్నదా