పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0297-5 కాంబోది సం: 09-281

పల్లవి:

ఇదియౌనె నీమాట యియ్యకొంటి నిఁకను
సుదతిరో మీ రిట్టె చుట్టములై వుండరే

చ. 1:

కమలాక్షుఁ డాతఁడు కలువకంటిని నేను
తమిఁ గూట మిద్దరికిఁ దగులు టెట్టే
జమళి నందుకొరకె చందసూర్యులకన్నుల
నమరివున్నాఁడు గదె అదివో రమణుఁడు

చ. 2:

బింబాధరుఁ డాతఁడు పికవాణిని నేను
యింబడర నిద్దరికి నేఁటిపొందులే
వంబులేక అందుకెపో వైపుగ మాధవుఁడనే
పంబిన పేరుధరించెఁ బక్కన నీవిభుఁడు

చ. 3:

తాను కౌస్తుభవక్షుఁడు తగు నే లతాంగిని
యీనెలవులఁ గూడితి మెటువంటిదే
పూని శ్రీవెంకటేశుఁడు పొసఁగె నీమేరలకె
కానవచ్చె నిన్నిటాను ఘనుఁడె నీమగఁడు