పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0297-4 ముఖారి సం: 09-280

పల్లవి:

ఏడలేని మొగమాట యిపుడుగలిగె నీకు
తోడ నిందాఁకా మమ్ము దూరు మని యంటివి

చ. 1:

తలఁచఁగానె వచ్చె తరుణి నీ రమణుఁడు
అలసి సొలసి నీవెఆడవె మాట
అలుక దేరిచే నంటా అండనే కూచున్నవాఁడు
చెలరేఁగి యేమైనఁ జేయవే చేఁత

చ. 2:

అడిగే నే ననఁగానె అరగొరలెల్లఁ దేర్చె
కడమలుమాని నవ్వఁ గదవె యిఁక
వొడలు నొడలు సోఁక నొద్దికై యాతఁ డున్నాఁడు
యెడయ కాతని భ్రమయించవే నేఁడు

చ. 3:

కరగించే ననఁగానె కాఁగిటఁ గూడి చొక్కె
యెరవులేక చన వియ్యవే నీవు
యిరవై శ్రీవెంకటేశుఁ డిన్నిటా నీ సొమ్మాయ
నురముపై నొరపుగనుండవే కాఁపురము