పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0297-2 బౌళి సం: 09-278

పల్లవి:

విన్నమాట యిదెసుమ్మీ వెల్లవిరిగా నేము
నిన్నటి మొన్నటి సుద్దినె మరియెరఁగము

చ. 1:

శిరసునెరులు నీవు చిక్కు దియ్యఁగా విభుఁడు
కరఁగి నీమోము చూచి క గ్గీరుపఁగా
తెరవేసిరి చెలులు దిష్టముగా నంతలోనె
సరసపు మీసుద్దు లచ్చట మే మెరఁగము

చ. 2:

మేనిగందమటు నీవు మెల్లనె నలఁచగాను
మోనాన నాతఁడు నీకు మోవియియ్యఁగా
పూని వూడిగేలవారు పొంచి వాకిటనుండిరి
మేనులుసోఁకినరతి మీఁద నే మెరఁగము

చ. 3:

పమ్మినచెమట నీవు పయ్యెదఁ దుడువఁగాను
కమ్మి శ్రీవెంకటేశుఁడు కాఁగిలించఁగా
చిమ్ములఁ గొలువువారు సిగ్గున లోనికేఁగిరి
దొమ్మిగా నేఁ గూడితి మీతుద నే మెరఁగము