పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0296-6 కేదారగౌళ సం: 09-276

పల్లవి:

తలఁచిన తలఁపులు దలకూడె
వెలుపలె లోపల వెర గిఁకనేలే

చ. 1:

వలచిన వలపులు వడ్డికిఁ బారీ
తలుపు దెరవవే తరుణి యిఁక
పిలువక వచ్చెను ప్రియుఁడు వాకిటికి
నిలువుల బిగువులు నీ కిఁకనేలే

చ. 2:

ముసి ముసి నగవులు మోవులనుండఁగ
ముసుగిడనేలే ముదిత యిఁక
రసములు గురిసీ రమణుఁడు నీతో
దొసఁగుల సుద్దులు తుద నిఁకనేలే

చ. 3:

కరఁగిన చెమటలు కాఁగిట నున్నవి
నిరతి మరఁగేలే నెలత యిఁక
యిరవుగ శ్రీవెంకటేశుఁడు గూడెను
ధర లోఁగొంటివి తడఁబాటేలే