పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0296-5 శ్రీరాగం సం: 09-275

పల్లవి:

తనకె విన్నవించరె తరవాతి పనులెల్లా
చనవు లిచ్చినవాఁడు చక్కఁ బెట్టనేరఁడా

చ. 1:

పొసఁగని సవతులపోరు మాకు నేఁటికె
కొసరుల కెల్లాఁ దానె గురిగాకా
యెసఁగ రమణులను యేలేవాఁడు రమణుఁడే
దొసఁగువారికి బుద్దులు చెప్పనేరఁడా

చ. 2:

వాడవనితలతోడి వంతులు మాకేఁటికె
యీడు వెట్టుకొని దూరే దితనిఁగాకా
జాడతో నడుపేవాఁడు సతులకు నాయకుఁడే
పాడిపంతము యేరుపరచఁ దా నేరఁడా

చ. 3:

కన్నవారితోడ మాకు కాఁతాళించ నేఁటికె
యిన్నినడప శ్రీవెంకటేశుఁడెకాకా
మన్నించి నన్నుఁ గలసె మరి వారికి నాతఁడె
కన్నెల నందరిని వొక్కటి సేయనేరఁడా