పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0296-2 సాళంగనాట సం: 09-272

పల్లవి:

మెచ్చితిరా నిన్ను నేను మేఁటి వౌదువు
యిచ్చకురాల నైతిని యిఁకనేఁటి మాటలూ

చ. 1:

మచ్చరముమాని నీతో మాటాడినది చాలక
కొచ్చి యంతలోనె నన్నుఁ గొంగువట్టేవు
యెచ్చి యెక్కినట్టివాని కేనుగ గుజ్జన్నమాఁట
యిచ్చట నీవల్లఁగంటి మిఁకనేఁటిమాటలు

చ. 2:

చేయిచాఁచి నీమీఁద నేసవెట్టుట చాలక
కాయ మంటి బలిమిని కాఁగిలించేవు
చాయసందైతె చావడి చంకఁబెట్టుకొన్నమాట
యీయెడ నీయందె వున్న దిఁకనేఁటిమాటలు

చ. 3:

కాఁకదీర నిన్ను నేను కదియుట చాలక
సోఁకనాఁడి నన్నుఁ గూడి చొక్కఁ జేసేవు
ఆఁక శ్రీవెంకటేశ పా లంటె గుటుకన్నమాట
యేఁకట నీజాడలాయ నిఁకనేఁటి మాటలు