పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0296-1 కొండమలహరి సం: 09-271

పల్లవి:

ఏమిసేతు నీ సుద్దుల కేమందును
దోమటిఁ గొంగువట్టఁగ తొలఁగి పోరాదు

చ. 1:

అత్తల నిత్తల నీకు ఆపె నేను నుండఁగాను
పొత్తుల నవ్వునవ్వేవు పోపో నీవు
చిత్తజమదమెకాని సిగ్గువడే దెరఁగవు
కొత్తలుగా నీతో నేము కోపగించరాదు

చ. 2:

తప్పక యిద్దరము పాదాలు నీకు నొత్తఁగాను
చెప్పరాని మాటాడేవు చీచీ నీవు
కుప్పళించెజవ్వనాన కొంకుగొస రెరఁగవు
యిప్పుడు నీతో మాకు నెదురాడరాదు

చ. 3:

యిరు దెస నీతో నేము యేకతములాడఁగాను
తొరలఁ గాగలించేవు తో తో నీవు
కెరలి శ్రీవెంకటేశ కిందుమీఁదు నెరఁగవు
పరగ నీరతుల నే పచ్చిసేయరాదు