పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0295-6 నాదరామక్రియ సం: 09-270

పల్లవి:

మగువలకొసరులు మగఁడె చేకొనవలె
నిగిడి బుద్దులు నాకు నేరుపవయ్యా

చ. 1:

చేముట్టి నీవు నాతోచేరి సరసమాడఁగ
యేమంటినో నిన్ను యెరఁగ నేను
కామించిన నా మోహమే కానుకవట్టితి నీకు
దీమసపు నా తప్పు దిద్దుకోవ య్యా

చ. 2:

పంతమున నీవు నన్ను పచ్చిసేసి పెనఁగఁగ
యెంతసేసితినో నిన్ను యెరఁగ నేను
సంతతము నావయసు జన్నెవట్టితి నీకు
యెంతైనా నావిన్నప మీడేరించవయ్యా

చ. 3:

గట్టిగా నీరతులలోఁ గలసి భోగించఁగాను
యెట్టుండెనో నీచిత్త మెరఁగ నేను
యిట్టె శ్రీవెంకటేశ యేలితివి నన్ను నీవు
మట్టులేని నాకోరిక మన్నించవయ్యా