పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0295-5 దేసాళం సం: 09-269

పల్లవి:

ఇంటిదాన నే నుండఁగా యెరవు సతమా నీకు
పెంటవెట్టుక నావద్దఁ బ్రియాలు చల్లేవు

చ. 1:

చొక్కుచు దయదలఁచి చూచేవు ఆపె నీకు
మొక్కిన మొక్కులె కడు మోపాయనా
చిక్కి నీకుఁ జేయఁగల సేవలెల్లా నేఁజేయఁగా
చెక్కులనొక్కులు మాకు సెలవు సేసేవు

చ. 2:

చెచ్చెర విన్నపాలకె చెవులొగ్గే వాపె నీకు
ముచ్చటాడిన మాఁటలే ముడుపాయనా
నిచ్చ పెండ్లికూఁతురవై నేనె నీవై యుండఁగ
నచ్చుల నీమోవితమ్మె నావంతు సేసేవు

చ. 3:

గునిసి మమ్మిద్దరినిఁ గూరిచితి వాపె నీపై
మొనగోరు మోపినదె మొదలాయనా
యెనసితిమి శ్రీవెంకటేశ నే నిన్ను మెచ్చితి
చనవి మనవి నాకె సతము సేసేవు