పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0295-4 ఆహిరి సం: 09-268

పల్లవి:

నీతోడివారమా నిను దూరేమా నీ
చేతిలోనివారము నీచిత్తము నాభాగ్యము

చ. 1:

బీరమాడి బెళకేవు పెనఁగి తలవంచేవు
ఔరా నీపొందు లెందుకై నావచ్చును
మారుమలనే వప్పటి మరి రండూ నడుపేవు
నేరుతు వన్నిపనులు నేనెఱఁగఁగాని

చ. 2:

అడిగి పెచ్చువెరిగే వానించి పంత మాడేవు
యెడరు నీసుద్దు లేమ నెంచవచ్చును
బడి బడి నిలిచేవు పట్టేవు కోకకొంగులు
గడుస వన్నిటా నీవు కడుముద్దరాలను

చ. 3:

బోదించి చిగిరించేవు పూఁచి కడలుదొక్కేవు
ఆదిగొని నిన్నెట్టు గాదనవచ్చును
యీదెస శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
పాదగు జూణవు నే నీ పలుకులోదానను