పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0295-2 వరాళి సం: 09-266

పల్లవి:

చూచితి నప్పుడే వాని సోరణగండ్ల నేను
యేచివేరె సింగారించి యిటుదోడితేరే

చ. 1:

గందవొడి చల్లరెకడుఁ జెమరించె మేను
ముందు ముందు విడెమీరె మోవివాడెను
చెంది నే నవిచూచితే సిగ్గువడీ నాతఁడు
మందలించి యలపార్చి మరితోడితేరే

చ. 2:

నిండఁ బన్నీరు చల్లరె నిట్టూర్పు నించీని
దండనె విసరరె దప్పిఁ బొందీని
వొండుపచారాలు నే నొకటిసేసినా లోఁగీ
యెండలెల్లఁ బాపి తగ నిటుదోడితేరే

చ. 3:

విరులు పైఁ జల్లరె వెట్టఁ బొరలున్నవాడు
తొరలఁ గప్పురమీరె తొట్టీఁ దగ
యిరవై శ్రీవెంకటేశుఁ డిట్టె నన్ను ముందుగూడె
సరినాపెఁ గూడివచ్చె చాలుఁ దోడితేరే