పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0295-1 దేసాక్షి సం: 09-265

పల్లవి:

ఏమినవ్వేవు మాతోను యెందాఁకా నీపంతము
మోముచూచి ఆపెచేత మొక్కించుకోవయ్యా

చ. 1:

చన్నులతోనె మొలచె సతికి నీపై వలపు
కన్నుల చూపుల నంటెఁ గడు నీరూపు
వున్నది నీరాకగోరి వోవరిలోపల నిట్టె
విన్నప మిదె యింటికి విచ్చేయవయ్యా

చ. 2:

కురులయన్నె కలవు కొమ్మకు నీపై చింతలు
తొరలెఁ జుట్టరికము దొమ్మిమేలాల
పరపుపై నదె నీపై పాటలువింటాఁ జొక్కి
యిరవిదె మన్ననకు యెఱుఁగుకోవయ్యా

చ. 3:

మాటలవెంటాఁ దగిలె మనసు యీకాంతకు
కూటము లన్నియునాయ కొనయాసల
యీటుతో శ్రీవెంకటేశ యెనసె నీవు రాఁగాను
తేటతెల్ల మాయ మేలు తెలుకోవయ్యా