పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0294-6 కాంబోది సం: 09-264

పల్లవి:

ఎఱఁగవుగాక నీవు యిందరివలెనా నేను
గుఱుతైన చేఁతచెప్పఁ గూళలున్నారా

చ. 1:

పచ్చిగా నిన్నుఁ గూడించి పంత మాడేదాననా
తచ్చి గుట్టు సేసి దాఁచేదానఁగాక
యిచ్చల సిగ్గువడి నాకేల వెరచేవు నీవు
ముచ్చట బాయిటవేసే మూఢులున్నారా

చ. 2:

మాటలు వెలుచుక ఆ మర్మా లెత్తేదాననా
తాటించి కప్పుకవచ్చేదానఁగాకా
గాఁటాన నన్నుఁజూ చేల కడుఁ దలవంచేవు
కూటమి ఱట్టుసేయను గొల్లదాననా

చ. 3:

వెలి నిన్ను మరిగించి వెంటఁ దిప్పేదాననా
తలఁగక యెనసుండేదానఁగాకా
యెలమి శ్రీవెంకటేశ యిట్టె పొందేల లోఁగేవు
యెలయించి నిన్ను నవ్వేయెడ్డలున్నారా