పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0294-5 మధ్యమావతి సం: 09-263

పల్లవి:

అన్నిటా జాణవుగావా అంతేసి నీవెఱఁగవా
యెన్నికగా మన్నించక యేలమానేవూ

చ. 1:

వచ్చుదాఁకా వేగిరమై వడిఁ బిలువనంపుదు
యిచ్చల నీ విందురాక యేలమావు
పచ్చియైన నామనసు పట్టలే నింతెకాక
యిచ్చిన నీబాసలు నీ వేలతప్పేవు

చ. 2:

నవ్వుదాఁకా వేగిరమై నలిఁ బదరుదుఁగాక
యివ్వల నన్నుఁ జెనక కేలమానేవు
రవ్వసేతు నింతెకాక రతి నాసవతులలో
నెవ్వరి మెచ్చక పొంద కేలవిడిచేవు

చ. 3:

వెసఁ గాఁగిలించుదాఁకా వేగిరించి కొసరుదు
యెసగి నన్నుఁ గలయ కేలమానేవు
కొసరి శ్రీవెంకటేశ కూడితివి నన్ను నీవె
యిసుకమీఁదైన చేఁత లేలమరచేవు