పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0294-4 శంకరాభరణం సం: 09-262

పల్లవి:

నేనేల తనునాడె నేఁడుగొత్తలా నాకు
తేనెగారే తనమోవి దిష్టమున్న దనవే

చ. 1:

తెల్లని తనకన్నులు దిమ్మరి జాగరముల
నెల్లవారుఁ జూడఁజూడ నెఱ్ఱనాయను
యెల్లిదము లాడేనంటా నెవ్వరిఁ గోపగించీనె
చల్లని తనచేఁతే విచారించుకొమ్మనవే

చ. 2:

పాలుగారే తనమోము భామలతో సాములను
వాలాయముగా నిదివో వసివాడెను
గేలితో నేఁజూచేనంటా కేరడ మే లాడీనె
తేలింపుఁ దనగుణమే తెలుసుకొమ్మనవే

చ. 3:

జిగిగొన్న తనమేను చెప్పరాని చేఁతలను
వెగటుఁ జెమట లుబ్బి వింతలాయను
నగి శ్రీవెంకటేశుఁడు నన్నుఁ గూడె నింతలోనె
మగటిమి నింక నిట్టె మన్నించుమనవే