పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0294-3 బౌళి సం: 09-261

పల్లవి:

తొల్లిటివంటిదానవా తొయ్యలినీవు నీ
వెల్లవారికంటె జాణ వెన్నికాయఁ జేఁతలు

చ. 1:

దగ్గరఁ బిలిచి నిన్ను తన్నుఁదానె మాటదీసి
సిగ్గు విడిపించెఁగదె చెలువుఁడు
వెగ్గళించి ఆతనిమై వేసితివి చేయి నీ
అగ్గళిక లెల్లఁ జెల్లె నాయఁగదె పనులు

చ. 2:

సరసపు మాటలాడి సన్నల నవ్వులు నవ్వి
వెరవు చూపీఁ గదె విభుఁడు నీకు
దొరతనము నెరపి తొక్కితివి పాదము నీ
యిరవు చేకొంటివి యిఁక నేలె సుద్దులు

చ. 3:

అందాన నిన్నుఁ బొగడె నలమేలుమంగ వని
విందుగా నిన్నుఁ గూడె శ్రీవెంకటేశుఁడు
మందెమేళమున నీవు మర్మము లంటితి విట్టె
యిందరిలోపలఁ దుదకెక్కెఁ గదె కతలు