పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0255-1 శంకరాభరణం సం: 09-025

పల్లవి:

మానవుగా మమ్ము నేల మగనాలిఁ జెనకేవు
కానీ కానీలే యింకాఁ జాలదా

చ. 1:

దక్కె నీకుఁ జాలదా తగు రుకుమిణి నీవు
వెక్కసాన లూటిసేసి వేసుకొన్నది
మొక్కల మది చాలదా మున్ను త్రిపురాంగనలఁ
జిక్కించి చీఁకటితప్పు సేసినది

చ. 2:

చెల్లె నదె చాలదా చేకొని రేపల్లె నీవు
గొల్లెతల మానములు కొల్లగొన్నది
అల్లది చాలదా నరకాసురుఁడు దెచ్చుకొన్న
పెల్లగు కామినులనుఁ బెండ్లాడినది

చ. 3:

అంత నీకుఁ జాలదా అల పూవులవారింటి
కాంత నీవు దొడికిన కల్లతనము
చెంతలఁ గూడితి నన్ను శ్రీ వెంకటేశ నీవు
మంతు కెక్కితిఁ జాలదా మన్నించినది