పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0293-3 మంగళకౌశిక సం: 09-255

పల్లవి:

ఇందాఁకా మాపని యిఁక నీపని
కందువాయ వలపులు కపట మే మున్నది

చ. 1:

చేతులనె మొక్కు మొక్కి సెలవుల నవ్వు నవ్వి
ఆతలనె నిలుచున్న దదివో చెలి
కాతరాన యిఁకమీఁదఁ గలిగిన పనులు నీ
చేతి వింతె యిఁక నీతో చెప్పనేమివున్నది

చ. 2:

కన్నులనె నిన్నుఁ జూచి కానుక నీ కంది యిచ్చి
అన్నిటా గుట్టున నున్న దదివో చెలి
సన్నలూను మీలోని సరసాలు నిటమీఁద
పన్నుకో నీవె నేర్తువు పలుక నే మున్నది

చ. 3:

మచ్చిక నీకుఁ జేసి మనసు నీపైఁ బెట్టి
యిచ్చటఁ గాఁగిలించె నిదివో చెలి
అచ్చపు శ్రీవెంకటేశ అట్టె నీవు గూడితివి
యిచ్చకములు లిటమీఁద నిన్ని నెఱుఁగుదువు