పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0293-4 రామక్రియ సం: 09-256

పల్లవి:

మించిన నాపంతములు మీ రెరఁగరా
నించిన కూరిములతో నెరవేరెఁ బనులు

చ. 1:

మనసిచ్చి తా నాతోను మాటలాడితేఁ జాలు
యెనయక వలవక యెందువోయీనే
పెనఁగక మీ రాతనిఁ బిలుచుకరారే యిందు
తనుఁదానె అన్ని నయ్యీఁ దరవాతిపనులు

చ. 2:

దంటతనమున కటు తగులఁ జూచితేఁ జాలు
యింటికిరాక డాయక యెందువోయీనే
గొంటుపరచక వద్దఁ గూచుండఁ బెట్టితేఁ జాలు
నంటుతోన మంచి వయ్యీ నడుమనే పనులు

చ. 3:

వట్టి శ్రీవెంకటేశుఁడు బలువుఁడు నన్నుఁ గూడె
యిట్టెవుండక యిఁక నెందువొయ్యీనే
గట్టిసేసితిరి మీరు గలిగివుండితేఁ జాలు
నెట్టన రతికెనెక్కె నేరుపైన పనులు