పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0292-6 కాంబోది సం: 09-252

పల్లవి:

కైవసపుదానఁగాని కపటిఁగాను
చేవదేర వలచితిఁ జిత్తగించవయ్యా

చ. 1:

కాయపు కాఁకలచేతఁ గసరుదు నొకవేళ
పాయపు మదము చేతఁ బదరుదును
చాయల సన్నల నిన్ను సాదింతు నొకవేళ
చేయెత్తి మొక్కే నిందుకే చిత్తగించవయ్యా

చ. 2:

యిచ్చిన చనవునను యీసడింతు నొకవేళ
గచ్చుల నీవద్ద నుండి గర్వింతును
ముచ్చటలాడుచు గోరుమోపుదు నే నొకవేళ
చెచ్చెరఁ బంతమిచ్చేను చిత్తగించవయ్యా

చ. 3:

పాదములొత్తుచు నిన్ను భ్రమయింతు నొకవేళ
సోదించి శ్రీవెంకటేశ సొలయుదును
ఆదిగొని కూడితి నిన్నలమేల్మంగ నవుదును
సేదదేర మన్నించి చిత్తగించవయ్యా