పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0292-5 ముఖారి సం: 09-251

పల్లవి:

కోపగించుకోఁగ నన్ను కొంగు వట్టే వింతెకాక
నాపొందు వలసితేను నవ్వక నేనుందునా

చ. 1:

పంతములే యాడేవు బలిమిఁ జెయివట్టేవు
చెంతల నీచెప్పినట్టు సేయనాతొల్లి
యింత వేగిరకాఁడవు యెందువోతివి నిన్న నేఁ
జింతించేయప్పుడు రాఁగఁ జేకొననైతినా

చ. 2:

సరసానకు వచ్చేవు సాదించఁ జూచేవు
గరిమ నీ వేమనినఁ గాదనేనా
నిరతి నే బాఁతైతే నీటుతో నేలవుంటివి
తరితీపై చెనకితే తనుపకమానేనా

చ. 3:

యిచ్చకము లాడేవు యిట్టె కాఁగిలించేవు
గచ్చుల నలమేల్మంగఁగానా నేను
అచ్చపు శ్రీవెంకటేశ ఆయ మెరిఁగికూడితి
వెచ్చరికెతో నుండఁగ యిట్టె మెచ్చనైతినా