పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0292-4 శ్రీరాగం సం: 09-250

పల్లవి:

విన్నవించ నేఁటికి విచారము లేఁటికి
నిన్నటనుండియు నాస నీకంటె గనము

చ. 1:

సిగ్గువడ్డ చెలిగాన చెనక కున్నదిగాని
అగ్గలము నీమీఁద నడియాస
దగ్గరె మొగమోటానఁ దలవంచుకుందిగాని
తగ్గని మోహము నీ చిత్తముకంటె గనము

చ. 2:

కొత్తగాఁ బెండ్లాడెఁగాన గుట్టున నున్నదిగాని
తత్తరించీ లోలోని తమకమైతె
హత్తి నీవు నవ్వేవని అంపకవున్నదిగాని
చిత్తిణి కోరికల నీ జిగికంటె గనము

చ. 3:

రతికిదగ్గరెఁగాన రవ్వసేయకుందిఁ గాని
చతురతలను నిన్ను జట్టిగొనును
యిత వెరిఁగి శ్రీవెంకటేశ యిట్టె కూడితివి
మితిమీరె యందుల నీమేలుకంటె గనము